మరో మూడు రోజులు జోరువాన జలదిగ్బంధంలో దక్షిణ తెలంగాణ

మరో మూడు రోజులు జోరువాన జలదిగ్బంధంలో దక్షిణ తెలంగాణ

వర్ష బీభత్సం రాష్ట్రమంతా కుండపోత.. పల్లెలు, పట్నాలు ఆగమాగం నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. స్తంభించిన జనజీవనం మున్నేరు ఉగ్రరూపం.. ఖమ్మం అతలాకుతలం.

20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకుపైగానే వర్షపాతం ఉప్పొంగిన వాగులు, కట్టలు తెగిన కాల్వలు, కూలిన ఇండ్లు హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు బంద్.

హైదరాబాద్ :

ఎటు చూసినా వాన.. పోటెత్తుతున్న వరద.. ఊర్లు చెరువులైనయ్.. పట్నాలు ఆగమైనయ్.. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా.. రాష్ట్రమంతా వాన ముంచెత్తింది. శనివారం మొదలైన వర్షం.. ఆదివారం దడపుట్టించింది. 24 గంటల పాటూ ఏకధాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండెకోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డునపడేసింది. కొన్ని ఏరియాల్లోనైతే 40 ఏండ్లలో ఎన్నడూ పడనంత వాన కురిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాన, వరద బీభత్సం సృష్టించాయి.

ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వాగుకు ఇరువైపులా కాలనీల్లోని జనం బక్కుబిక్కుమంటూ గడిపారు. వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జనగామ జిల్లాల్లో 25 సెంటీమీటర్లకుపైగానే వర్షపాతం నమోదైంది. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది. మరో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు.ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తరాది జిల్లాలను వరుణుడు వణికించాడు.

ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి సిద్దిపేట, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిజామాబాద్ జిల్లా తుమ్మపల్లిలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిండుకుండల్లా హైదరాబాద్ జంట నగరాల జలాశయాలు…

కామారెడ్డిలో 16, అదే జిల్లా సర్వాపూర్లో 15.7, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 15.5, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 15.4, గాంధారిలో 15, సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో 14.2, నారాయణరావుపేటలో 14.1, మెదక్ జిల్లా మిన్పూర్లో 13.9, వరంగల్ జిల్లా సంగెంలో 11, జనగామ జిల్లా గూడూరులో 11, రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 11, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 10.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ముసురు కమ్మేసింది. అత్యధికంగా మలక్పేటలో 4.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

8 మండలాల్లోనే అత్యల్పం…

శని, ఆదివారాలు కురిసిన వర్షాల ధాటికి రాష్ట్రంలో వర్షం పడని ప్రాంతమంటూ లేకుండా అయిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. కేవలం 8 మండలాల్లోనే అత్యల్ప వర్షపాతం నమోదుకాగా.. మిగతా 604 మండలాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మొత్తంగా శని, ఆదివారాల్లో 199 మండలాల్లో మోస్తరు వర్షపాతం రికార్డ్ కాగా.. 277 మండలాల్లో భారీ వర్షాలు, 88 మండలాల్లో అతిభారీ, 40 మండలాల్లో అత్యంత భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. 40 మండలాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.

ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 22 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డ్ అయింది. మొత్తంగా 17 జిల్లాల్లోని 250 మండలాల్లో ఎక్సెస్, 5 జిల్లాల్లోని 122 మండలాల్లో లార్జ్ ఎక్సెస్, 11 జిల్లాల్లోని 230 మండలాల్లో సాధారణ వర్షపాతాలు నమోదయ్యాయి. కేవలం 10 మండలాల్లోనే లోటు వర్షం నమోదైంది.

ఇందూరు జిల్లాలో ఉప్పొంగిన వాగులు…

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురియగా.. వాగులు, వంకలు ఉప్పొంగాయి. దీంతో ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 41 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. కామారెడ్డి జిల్లా టెకిర్యాల సమీపంలో హైదరాబాద్ వెళ్లే హైవే పై రోడ్డు కోతకు గురికావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

పాలమూరులో నిలిచిన రాకపోకలు…

మహ బూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో -తాండూరు వెళ్లే వాహనాలను సల్కార్పేట్ మీదుగా, పరిగి వెళ్లే వాహనాలను నవాబ్పేట, కుల్కచర్ల మీదుగా డైవర్ట్ చేశారు. కోయిల్కొండ మండలంలో గుండేట్ వాగు పొంగడంతో మల్కాపూర్, పారుపల్లి గ్రామాలకు, దమాయపల్లి వాగు పొంగడంతో గార్లపహాడ్, దమాయపల్లి గ్రామాలకు, నర్వ మండలంలోని రాయికోడ్ చెరువు అలుగు పారడంతో రాయికోడ్, కాట్రపల్లి, మక్తల్కు రాకపోకలు నిలిచాయి.

కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఊట్కూరు మండలం సమస్తాపూర్ చిన్న వాగు బ్రిడ్జిపై ఉధృతంగా వరద నీరు పోతుండటంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల మట్టి మిద్దెలు కూలిపోవడంతో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ భవనాల్లో ఆశ్రయం కల్పించారు.

జలదిగ్బంధంలో మానుకోట…

భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్జిల్లా జలదిగ్బంధంలో చిక్కింది. మహబూబాబాద్ జిల్లా తాళ్ల పూస పల్లి, ఇంటికన్నె వద్ద రైల్వేట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. సింహపురి ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్లో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ జిల్లాలో వరదల కారణంగా సుమారు 8 చెరువులు తెగిపోయాయి. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లా కేంద్రాలను వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ఇండ్లల్లోకి నీరు చేరడంతో, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరో మూడు రోజులుజోరు వాన…

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిందని తెలిపింది. సోమవారం ఉదయం నాటికి అది మరింత బలహీనపడి మరో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. దాని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉత్తరాది జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇటు హైదరాబాద్ సిటీలోనూ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఖమ్మం.. కకావికలం…

ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఆదివారం నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధానంగా మున్నేరును ఆనుకున్న లోతట్టు కాలనీలతో పాటు, లకారం చెరువును ఆనుకొని ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కవిరాజ్ నాగర్, నయాబజార్, ప్రకాష్ నగర్ చప్టా, ఇందిరానగర్, కోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటు కవిరాజ్ నగర్ తదితర ఏరియాల నుంచి 7,090 మంది నిరాశ్రయులను 39 పునరావాస సహాయ కేంద్రాలకు తరలించారు.

కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్న నలుగురు గల్లంతు కాగా, ఒకరిని స్థానికులు కాపాడారు. ఖమ్మం ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. రాత్రి వారు సురక్షితంగా బయటకు వచ్చారు. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో 52 మంది వరదల్లో చిక్కుకోగా వారిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. పాలేరు రిజర్వాయర్ అలుగు పోస్తుండడంతో ఖమ్మం, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆదివారం వర్షంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

విరిగిపడినకొండ చరియలు

భారీ వానలతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైలం వెళ్ళే భక్తులు, పర్యాటకులు రావద్దని అధికారులు సూచించారు. మన్ననూర్ చెక్ పోస్టును తాత్కాలికంగా మూసివేశారు.

కరీంనగర్సిటీలో ఇండ్లలోకి నడుంలోతు నీళ్లు…

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ సిటీలోని ముకరంపురంలో ఇండ్లలోకి నడుం లోతు వరకు నీళ్లు చేరాయి. వేములవాడలో మూలవాగు ఉధృతికి బుడగజంగాల కాలనీ నీట మునగ డంతో స్థానికులను పునరావాస కేంద్రానికి తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదరయ్యాయి. రేగడిమద్దికుంట, కొదురుపాక గ్రామాల్లో పలువురి ఇండ్లు నీటమునిగాయి.

అల్లాడిన కోదాడ…

సూర్యాపేట జిల్లా కోదాడ అల్లాడిపోయింది. నేషనల్హైవేపైకి వరద పోటెత్తడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మూసీకి భారీ వరద రావడంతో నల్గొండ జిల్లా శాలిగౌరారం, నార్కట్పల్లి, కేతేపల్లి, నకిరేకల్, సూర్యాపేట, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, నేరేడుచర్ల, దామరచర్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాగులు, వంకలు పోటెత్తడం, చెరువులు తెగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్ మున్సిపా లిటీల్లో నాలాలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. నార్కట్పల్లి నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నార్కట్పల్లి, అద్దంకి హైవేకి దారి మళ్లించారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా మూసీలో వరద పెరిగింది. దీంతో జిల్లాలోని రుద్రవెల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిని తాకుతూ మూ సీ ప్రవహించింది. సంగెం సమీపంలోని భీమలింగం లోలెవల్ బ్రిడ్జి వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. దీంతో వలిగొండ మండలం సంగెం, భువ నగిరి మండలం బొల్లెపల్లితోపాటు పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట, మో టకొండూరు మండలాల్లోని లోలెవల్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.

ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్లు…

మహబూబాబాద్ జిల్లా పరిస్థితి గుండెచెరువులా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాల్లో ఈ జిల్లాకు చెందినవే 8 ప్రాంతాలున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డ్ స్థాయిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా చిన్నగూడూరులో 45.2, నర్సింహులపేటలో 40.6, నెల్లికుదురులో 38.4, దంతాలపల్లెలో 35.1, మరిపెడలో 34.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.

సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 34.1, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 33.8, కురవిలో 33.7, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 33, మహబూబాబాద్లో 32.5, వరంగల్ జిల్లా నెక్కొండలో 31.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 31.6, ఖమ్మం జిల్లా కూసుమంచిలో 31.5, సూర్యాపేట జిల్లా చిల్కూరులో 30.6, హుజూర్నగర్లో 30.4, భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో 28.8, జనగామ జిల్లా కొడకండ్లలో 28.3, సూర్యాపేట జిల్లా కోదాడలో 27.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 25.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది..