ఖమ్మం వరద బీభత్సానికి అసలు కారణమిదే…!!!

ఖమ్మం వరద బీభత్సానికి అసలు కారణమిదే…!!!

వరద నీరు వెళ్లేదారి లేకనే..

అధికారుల తప్పిదాలు, అక్రమార్కుల అత్యాశ

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో భవంతుల కట్టడాలు

డ్రెయినేజీలు మూసి నిర్మాణాలు, రోడ్లపైకి ర్యాంపులు

నాలాలు మూసేసి నిర్మాణాలు

నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది. అయితే ఖమ్మం అర్బన్‌ పరిధిలో శనివారం కురిసిన వర్షం కంటే కూడా పెద్దఎత్తున వర్షపాతం నమోదైన సంఘటనలు బోలెడున్నాయి. కానీ ఆయా సమయాల్లో ఎన్నడూ లేనివిధంగా నగర పాలక సంస్థ పరిధిలోని పదులకొద్దీ డివిజన్లు ముంపునకు ఎందుకు గురవుతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగేస్థాయిలో వరద రావడం ఇది నాలుగోసారి కాగా, ఆ నాలుగుసార్లు కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతోపాటు యేటికేడు వరద ముప్పు తీవ్రతరమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా గతంలో అంతకుమించిన వర్షాలు పడిన సమయంలో కొద్దీగొప్ప నష్టం ఉన్నప్పటికీ ఇంతటిస్థాయిలో జననివాసాలు ముంపునకు గురవడం గడిచిన రెండేళ్ల కాలంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

వరద వెళ్లేదారిలేకనే ముంపు

ప్రస్తుతం కురిసిన వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతలమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి మున్నేరుకు వరద పెరిగిన సమయంలో మున్నేరు నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే ప్రభావితమయ్యేవి. కానీ గతేడాది వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మం నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరుకుని ఇళ్లల్లో నీళ్లు నిలిచిపోయాయి. కాగా శనివారం కురిసిన వర్షాలకు మాత్రం ఖమ్మం నగరం మొత్తం వరదనీటితో నిండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్నేరు నదీ ప్రవాహానికి చేరువలో ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, మోతీనగర్‌, వెంకటేశ్వరనగర్‌, రంగనాయకులగుట్ట, ప్రకాష్‌నగర్‌, బొక్కలగడ్డ, పద్మావతినగర్‌ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రెండు, మూడు ఫ్లోర్లు ఇళ్లు మొత్తం కనిపించని పరిస్థితి ఏర్పడింది.

ఇదే అసలు కారణం..

వాటన్నింటికీ కారణంగా మున్నేరు తీవ్రంగా ప్రవహించడంతో వరదనీరు కలిసే అవకాశం లేని కారణాన్ని కొందరు చెబుతున్నప్పటికీ.. ఎగువనుంచి ఎగబాకిన వరదనీరు వెళ్లేదారిలేకపోవడంతో దిగువన ఉన్న ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘునాథపాలెం నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, అమరావతినగర్‌, విద్యానగర్‌ నుంచి వచ్చే వరదనీరు మొత్తం ఖానాపురం చెరువుమీదుగా లకారం మీదుగా మున్నేరులో కలవాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సైతం ఇదేరీతిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ దారులన్నీ మూసివేసిన కారణంగా ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఇళ్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. అయితే ఇంతటిస్థాయిలో నష్టం జరగడానికి కారణం సుందరీకరణ పేరుతో పార్కులు ఏర్పాటు చేసి వరద వెళ్లేందుకు దారిలేకుండా అడ్డుకట్ట వేయడం కూడా కారణమేనంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌లలో నిర్మాణాలు..

మున్నేరు నది, ఖానాపురం, లకారం వంటి చెరువులు, ఆయా చెరువులకు అనుసంధానంగా చైన్‌లింక్‌ కాల్వల పరిధిలో ఎలాంటి భూములున్నా సరే.. వాటికి సంబంధించి క్రయ విక్రయాలు సాగకూడదు. ఆయా ప్రాంతాల్లో వెంచర్లకు, ప్లాట్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు నిషేధం. కానీ సాధారణ భూములకు మాదిరే అన్నీ రకాల పనులు సాగించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి మొదలుకుని ఇళ్ల నిర్మాణాలు, వాటికి అనుమతులు సైతం మంజూరుచేశారు. ఆయా అక్రమ నిర్మాణాల కారణంగా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆయా ఇళ్లకు నీరు పోటెత్తడం పరిపాటిగా మారిందన్న విమర్శలు లేకపోలేదు.

డ్రెయినేజీలు మూసేసి..

మున్నేరు పరివాహక ప్రాంతంలోని బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లలో జోరుగా భవంతులు నిర్మాణాలు జరగ్గా.. నగరంలో సైతం అదేరీతిలో కాల్వలను కబ్జాచేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు నిర్మించారు. పలు అపార్ట్‌మెంట్లలో అండర్‌గ్రౌండ్‌ పేరుతో లోపలికి వెళ్లిన వరదనీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా సెల్లార్లు నిర్మించారు. డ్రెయినేజీలను ఆక్రమించి రోడ్లపైకి నిర్మాణాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాంపులు వేసి డ్రెయినేజీలు మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాస్టర్‌ప్లాన్‌లో బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలకు సైతం లోకేషన్లు మార్చి అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు ఖమ్మం కార్పొరేషన్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండటంతోపాటు మిగిలిన వరదనీరు సైతం బయటకు వెళ్లేందుకు మార్గం లేక కట్టలు కట్టిన కారణంగా ఆయా డివిజన్లలో నీళ్లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది.

నిద్రలు లేకుండా..

ఫలితంగానే మంత్రుల నుంచి మొదలుకుని జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సైతం నిద్రలు లేకుండా శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వరదలు వచ్చిన సమయంలోనే వీటిపై దృష్టిసారిస్తే ప్రస్తుతం ఇంతటిస్థాయిలో నష్టం ఉండేదికాదన్న వాదన వినిపిస్తుంది. ఒక్క రాత్రి కురిసిన వర్షానికే ఖమ్మం నగరం పరిస్థితి ఇలా తయారైతే మున్ముందు భారీ ఎత్తున వర్షాలు పడితే ఎంతటిస్థాయిలో నష్టం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

బురదమయమైన బతుకులు

మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఏటా కన్నీటి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు వరదల సమయంలో ముంచుకొస్తున్న ముప్పు గురిం చి అధికా రయంత్రాంగంతో పాటుగా తాము ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు కూడా కనీసం పది నిమిషాల ముందు కూడా సమాచారం ఇవ్వలేదని బాధితులు కన్నీరు పెట్టారు. ఆకస్మికంగా ఇంటిని చుట్టు ము ట్టిన వరదతో పిల్లలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంటి నుంచి బ య పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవ త్సరం కూ డా వరద వచ్చినా ఇంత స్థాయిలో నష్టం జరగ లేదన్నారు. మున్నేరు వర ద ప్రభావిత ప్రాంతాలని సోమవారం సందర్శించిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతి నిధులతో బాధితులు తమ బాధలను పంచుకున్నారు.

వరద సమాచారం ఇవ్వలేదు : మోకాటి సుగుణ

మున్నేరుకు వరద వస్తుందని కనీస సమాచారం ఇవ్వలేదు. ఒక్కసారి గా వరద ఇంటిని చుట్టూ ముట్టటంతో కట్టుబట్టలతో ఇంటో నుంచి బయ టపడ్డాం. ఇంట్లో ఉన్న వస్తువులు వరదలో కొట్టుకు పోయాయి.

తిండి గింజలు బురదలో కలిశాయి: కారంగుల కౌసల్య

ఒక్కసారిగా వరద రావటంతో ఇంట్లోని వస్తువులతో పాటు ఇంటి పైన రేకులు నీటిలో కొట్టుకుపోయాయి. బియ్యం, పప్పులు బురదలో కలిశాయి. మీమంతా కట్టుబట్టలతో మిగిలాం. రూ.4లక్షల వరకు నష్టపోయాం. ఇంటి రేకులు కొట్టుకుపోవటంతో రోడ్డుపైనే ఉంటున్నాం.

చంటి బిడ్డతో బయపడ్డాం : వకజాల గోపిక

ఆకస్మికంగా వచ్చిన వరదలతో నెల రోజుల చింటి బిడ్డతో ఇంట్లో నుంచి బయటపడ్డాం. దండెం మీద దుస్తులు ఇంట్లోని సామగ్రి వరదలో కొట్టుకుపోయాయి.ఇద్దరు పిల్లలతో పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాం. ఇంట్లో మాకేం మిగలలేదు.

పిల్లలే మిగిలారు: యూ. యేసుకుమారి

మా ఇంట్లో నా భర్త, నేను, మా ఇద్దరు పిల్లలే మిగిలాం. ఇంట్లో నుంచి వరద ప్రవహించడంతో ఏమీ మిగల లేదు. ఇద్దరు పిల్లలను తీసుకొని పునరవాస కేంద్రంలో నేను ఉన్నా. నా భర్త మా ఇంట్లో చేరిన బురదను శుభ్రం చేసేందుకు వెళ్లారు. రూ.5లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.

దిక్కులేని పక్షులమయ్యాం: పరికపల్లి ఈరమ్మ

మున్నేరు వరదతో నేను, నా కూతురు ఆమె ఇద్దరు ఆడపిల్లలు దిక్కు లేని పక్షులమయ్యాం.. భర్తలేని నా కూతురు కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తోంది. వరద వస్తోందని గమనించే లోపే వర ద చుట్టుముట్టింది. కట్టుబట్టలతో బయటికొంచ్చాం. ఇంట్లోని వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. పిల్లల పుస్తకాలు కూడా పోయాయి.

మూడు కుటుంబాలను ముంచేసింది : అఫ్జల్‌ బీ

ఒక మాయలా వరద వచ్చి మూడు కుటుంబాలను ముంచేసింది. కూలి పనులు చేసుకొని పొట్ట పోసుకునే నేను నా ఇద్దరు కుమారులు ఒకే ఇంట్లో వేర్వేలు గదుల్లో ఉంటున్నాం. వరద మమ్మల్ని రోడ్డున పడేసింది. ఇంట్లోని సామగ్రి, బియ్యం పనికిరాకుండా పోయాయి. మాకు ఏ ఆధారమూ లేదు. మా పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు.

కట్టుబట్టలు కన్నీళ్లే మిగిలాయి : ఎస్‌కే మన్నీ

మున్నేటి వరద మా కష్టార్జితాన్ని నీళ్ల పాలు చేసింది. కష్టించి కూడబెట్టుకున్న సామగ్రి నీటిపాలైంది. మంచాలు, ఫ్రిజ్‌, టీవీలు ఎందుకూ పనికి రాకుడా పోయాయి. కట్టుబట్టలతో మిగిలాం.. అని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు..