ప్రభుత్వం మెడకు పదేండ్ల బిల్లులు… సర్కారుకు మరమ్మతుల సవాల్…
అప్పటి బిల్లులిస్తేనే రిపేర్లంటున్న కాంట్రాక్టర్లు
పెండింగ్‌లో రూ.20 వేల కోట్లు
ఉన్నతస్థాయిలో ఇప్పటికే పలుమార్లు చర్చలు
అయినా మెత్తబడని కాంట్రాక్టర్లు… సీఎం నిర్ణయమే ఫైనల్
గత వారం రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. వరద తాకిడి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
ప్రస్తుతానికి వానలు ఆగాయి, వరదలూ తగ్గాయి. హమ్మయ్య… అనుకునేలోనే ప్రభుత్వం ముందుకు మరో సమస్య వచ్చి పడింది.
అదే మరమ్మతులు.సూర్యాపేట,ఖమ్మం, మహబూబాబాద్ తోపాటు మరికొన్ని జిల్లాల్లోని జాతీయ, అంతరాష్ట్ర, అంతర్ జిల్లా రహదారులు, మండలాలు, గ్రామాలను కలిపే రోడ్లు, వాటితోపాటు కల్వర్టులు, బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వాటి మరమ్మతులకు కాంట్రాక్టర్ల పాత బకాయిలు ఆటంకంగా మారాయి. వరదలకు దెబ్బతిన్న రహదారులు కల్వర్టులు ఇతర నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలంటూ ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌తోపాటు సాగునీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క సైతం ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు.
అనంతరం రిపేర్లు చేయించేందుకు వీలుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు అంచనాలు కూడా రూపొందించారు.
కాంట్రాక్టర్లతో పలుమార్లు చర్చలు జరిపారు.
కానీ అవి ప్రాథమిక దశలో ఉండగానే పీఠముడి పడింది. కారణం… గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సివిల్ వర్కులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో పేరుకుపోవటమే. వివిధ శాఖలు.
రంగాలకు సంబంధించి మొత్తం 4 లక్షల బిల్లులు, రూ.40 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే.
వీటిలో సగభాగానికి పైగా (రూ.20 వేల కోట్లు) కాంట్రాక్టర్లకు చెందినవే ఉన్నాయని తాజాగా అధికారులు తెలిపారు.
వీటిని చెల్లిస్తేనే గానీ తాము ఇప్పుడు రిపేర్లను చేపట్టలేమంటూ గుత్తేదారులు చేతులెత్తేశారు. గతంలో చేసిన పనుల తాలూకూ యంత్రాలు, ఇంజినీర్లు, కూలీలు, ఇతర సిబ్బందికి చెల్లించేందుకు తాము అప్పులు చేశామంటూ కాంట్రాక్టర్లు… అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇంకా చాలా మందికి డబ్బులు చెల్లించాల్సి ఉందనీ, చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని వారు వాపోయినట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు.
అందువల్ల పాత బకాయిలు చెల్లించాలంటూ గుత్తేదారులు కోరుతున్నారని ఆయన వివరించారు.
మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో రోడ్లు భవనాల (ఆర్ అండ్ బీ) శాఖకు రూ.2,362 కోట్లు, విద్యుత్, ఇంధన శాఖకు రూ.175 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.629 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు (గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ) రూ.170 కోట్లు, పురపాలక శాఖకు రూ.1,150 కోట్లు, ప్రభుత్వ ఆస్తులకు రూ.500 కోట్లు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇవిపోను వైద్యారోగ్య శాఖకు రూ.12 కోట్లు, పశు సంవర్థకశాఖకు రూ.25 కోట్లు నష్టమొచ్చిందని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆయా శాఖల పరిధిలో మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది.
కానీ సందర్భాన్ని ఉపయోగించుకుని కాంట్రాక్టర్లు మొండికేయటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, కాంట్రాక్టర్లను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు రంగంలోకి దిగబోతున్నారని సమాచారం.
అయితే వారు చెప్పినా గుత్తేదారులు వింటారా? లేదా? అనుమానం అధికారవర్గాల్లో నెలకొన్నది.
ఒకవేళ మంత్రులు స్వయంగా చర్చలు జరిపినా ఏదో ఒక గడువులోగా బకాయిలు చెల్లిస్తామనే హామీని కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాని పని. అందువల్ల ముఖ్యమంత్రి రేవంతే స్వయంగా రంగంలోకి దిగి…గుత్తేదారులతో భేటీ అయితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో సీఎం రెండు మూడు రోజుల్లో వారితో చర్చలు జరిపే అవకాశముందని తెలిసింది.
ఇదే సమయంలో బకాయిలను ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయినా ఒక్కో కాంట్రాక్టర్‌కు ఎంతోకొంత చెల్లించటం ద్వారా రిపేర్లకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఆఘమేఘాల మీద కొత్తగా టెండర్లను పిలిచి, వచ్చే కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులివ్వటం కంటే పాతవారినే బుజ్జగించటం మేలని సర్కారు నిర్ణయించినట్టు వినికిడి.