హైదరాబాద్ :
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి.
వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , నీటిసరఫరాల శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణావసరంగా రూ.24 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
బుధవారం ఆమె సచివాలయంలో తమ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్‌లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో వరదలకు రికార్డు వర్షపాతంతోపాటు కబ్జాలే కారణం.
జిల్లా పంచాయతీ అధికారులు ఊరూరా ఉన్న జలాశయాల వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలి. ప్రతి మండలంలో ఐదుగురు అధికారులతో వరద నిర్వహణ కమిటీలను నియమించాలి’’ అని సీతక్క సూచించారు.
సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఈఎన్‌సీలు కృపాకర్‌రెడ్డి, కనకరత్నంతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.