జపాన్లో టీచర్స్ డే ఉండదట…

జపాన్లో టీచర్స్ డే ఉండదట…

అసలు జపాన్ దేశస్దులకు అలాంటి ఓ రోజు ఉందనే సంగతే తెలియదు..

అసలు కథ చెబుతా వినండి..

మన దేశంలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఓ మాస్టారు ఢిల్లీలో అవార్డు స్వీకరించి అటు నుంచి అటే జపాన్ వెళ్లారు..అక్కడ తన మిత్రుని కుటుంబంతో కొన్నాళ్ళు గడిపి పనిలో పనిగా ఆ గొప్ప దేశంలోని విశేషాలు..టోక్యో వంటి మహానగరాన్ని చూసి వద్దామని..

టోక్యోలోనే నివాసం ఉంటున్న మాష్టారి మిత్రుడు ఆయన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వచ్చాడు.పరస్పర ఆలింగనాలు..క్షేమ సమాచారాలు అయిన తర్వాత ఇద్దరూ కలిసి
మిత్రుడి ఇంటికి బయలుదేరారు.

లోకల్ రైల్వే స్టేషన్లో కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే మాస్టారికి తెలిసింది జపాన్లో టీచర్స్ డే జరపరని..ఆయన ఆశ్చర్యపోతూ అదేంటి ఇన్ని రంగాల్లో ఇంత గొప్ప అభివృద్ధి సాధించిన మీ దేశంలో మీ అభ్యున్నతికి కారణమైన గురువులను సత్కరించుకోరా..అందుకోసం కనీసం ఒక రోజును కేటాయించి టీచర్లను గౌరవించలేరా అని కొంచెం కోపంగానే దులిపేసారు మిత్రున్ని..మాస్టారి ఫ్రెండ్ మౌనంగా ఉండిపోయాడు..!

ఈలోగా ట్రెయిన్ వచ్చింది.

కంపార్ట్మెంట్ కిక్కిరిసి ఉంది.మిత్రులు ఇద్దరూ జనం మధ్య కొంచెం చోటు చేసుకుని నిలబడ్డారు.

ఈలోగా వారి కంటే పెద్దాయన తాను లేచి మన మాస్టారిని కూర్చోమన్నాడు.

వద్దులెండి..మేము సర్దుకుంటాం..మీరు పెద్దవారు కదా అన్నా ఊరుకోకుండా ఆయన మాస్టారిని చెయ్యి పట్టి మరీ తన సీట్లో కూర్చోబెట్టాడు.

మాష్టారు ఆ ఘటన పట్ల నిర్ఘాంతపోయారు.

రైలు దిగి వెళ్తుంటే కొందరు మాష్టారి మిత్రునికి గాక ఆయనను విష్ చేస్తున్నారు.

ఈసారి మాస్టారి ఆశ్చర్యం రెట్టింపయింది.ఇక ఉండబట్టలేక మిత్రున్ని అడిగారు. ఏమిటిదంతా అని.. అప్పుడూ మిత్రుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఆ తర్వాత మాస్టారు మిత్రునితో అన్నారు..మీ ఇంటికి వెళ్తున్నాము కదా..

పిల్లలకి ఏమైనా కొందాము అంటే మిత్రుడు ఒక షాపుకి తీసుకెళ్ళాడు.

అక్కడా మాస్టారికి రాజపూజ్యమే..కొన్న ప్రతి వస్తువుకీ తగ్గింపే.. మాష్టారి నోట మాట రాలేదు.

అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు మిత్రులు ఇద్దరూ..అక్కడ మాస్టారికి బ్రహ్మరథమే..అఖండ స్వాగతం..సత్కారం..

కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు జల్లుకోలేదు కానీ ఆ దేశ సంప్రదాయం ప్రకారం అన్ని విధాలా గౌరవించారు మాస్టారిని..

ఇక మాస్టారు ఆగలేదు..

ఏంటి ఇదంతా..నన్నో దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారేంటి మీ దేశంలో..అని నిలదీశారు మిత్రున్ని..

అప్పుడు చెప్పాడు ఆ స్నేహితుడు..నువ్వు మీ దేశంలో సన్మానం అందుకుని నేరుగా ఇక్కడికి వచ్చావు కదా..నీ మెడలో టీచర్ అనే బ్యాడ్జీ ఇంకా అలాగే ఉంది.

అదే నిన్ను ఇలా అంత ఎత్తులో కూర్చోబెట్టింది.

మా దేశంలో టీచర్లకు చాలా విలువ ఇస్తాము..ఏ దేశం వారైనా..టీచర్లు మాకు అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు.వారికి ఎనలేని గౌరవం ఇస్తాం.టీచర్లు రైళ్లలో..బస్సుల్లో నిలబడకూడదు..

క్యూల్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు.కొనుగోళ్లలో రాయితీలు..ఇంకా ఎన్నో గౌరవాలు..ఇక్కడ టీచర్లు మొదటి తరగతి పౌరుల లెక్కన్నమాట..అందుకే ఇందాక రైల్లో..స్టేషన్లో నీకు అంత గౌరవం లభించింది.

సర్వకాలసర్వావస్థలలో టీచర్లను ఇంతలా గౌరవిస్తాం గనకనే మాకు టీచర్స్ డే అంటూ ప్రత్యేకంగా ఉండదు.

ఇదీ సంగ్రహం..!

మాస్టారికి నోట మాట రాలేదు.అంతకు కొన్ని గంటల ముందు తనకు జరిగిన సత్కారంతో పోలిస్తే దేశం కాని దేశంలో అపరిచితుడుగా లభించిన మర్యాద ఏ మాత్రం తీసిపోదనిపించింది.
ఆ అనుభవం ఆయన్ను ఉక్కిరబిక్కిరి చేసింది.

అంతే కాదు.ఇటీవలి కాలంలో దిగజారుతున్న మన విలువలు..గురువుల పట్ల సన్నగిల్లుతున్న గౌరవమర్యాదలు..సినిమాల్లో టీచర్లను ఆట పట్టిస్తున్నట్టు తీస్తున్న సన్నివేశాలు..అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరిగాయి..

ఇది కదా నిజమైన సంప్రదాయం..

ఇది కదా గురుదేవో మహేశ్వర అన్న ధర్మానికి నిజమైన తార్కాణం..

ఇదే కదా గురుసాక్షాత్

పరబ్రహ్మకు వాస్తవ రూపం..

అనుకుంటూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ

మిత్రుని వెంట గెస్ట్ రూముకి నడిచారు.

అందుకే జపాన్ ప్రపంచ దేశాల్లో అన్నిటా అగ్రగామిగా ఉంది..