అల్పపీడన ప్రభావంతో ఏపీకి మరో నాలుగు రోజులు… భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఏపీకి మరో నాలుగు రోజులు… భారీ వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది.

ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇటు ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆదివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. విజయవాడ నగరంలో మరోసారి భారీవర్షం కురిసింది. సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే రూట్లో ఇంకా నీళ్లున్నాయి. కృష్ణా జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి.