హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తం… నోటీసులపై మురళీమోహన్
హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్న మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారని.. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మురళీమోహన్ స్పందించారు.
నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.