హైడ్రా దడ… FTL , బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైడ్రా దడ… FTL , బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

దాదాపు మాయమైన మాదాపూర్‌ సున్నం చెరువు.

సున్నం చెరువును పూడ్చి..బోర్లు వేసి నీటి వ్యాపారం.

అమీన్‌పూర్‌లో ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు నేలమట్టం… ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు

మియాపూర్‌/అమీన్‌పూర్‌ :

FTL , బఫర్‌ జోన్లలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్నది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున నుంచే కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామ పరిధిలోని సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో నిర్మించిన శాశ్వత భవనాలు మూడింటిని, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారీ షెడ్లు 16కు పైగా నేలమట్టం చేశారు.

గతంలో ఈ చెరువు కబ్జాలకు గురవుతుందని ప్రజాసంఘాల నాయకులు.. వివిధ శాఖల అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా ఆదివారం ఉదయం కూల్చివేతలను ప్రారంభించింది.

ఒకవైపు కూల్చివేతలు చేపడుతుండగా చాలా రోజులుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపడతారని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలను పూర్తి చేశారు.

శేరిలింగంపల్లి మండలపరిధిలో 26 ఎకరాల్లో విస్తరించి ఉన్న సున్నం చెరువు.. దాదాపు మాయమైపోయిందనే చెప్పాలి. ఈ చెరువు చాలాకాలంగా కబ్జాలకు గురవుతోంది.

2013లో సర్వే నిర్వహించిన ఇరిగేషన్‌ అధికారులు ఈ చెరువులో 15.23 ఎకరాల్లో నీళ్లు ఉన్నాయని నిర్ధారించారు.

2013లో హెచ్ఎండీఏ 4805 ఐడీ నంబర్‌ ఇచ్చింది. చెరువు ఎన్టీఎల్‌ పరిధిలోనే సర్వే నంబర్‌ 13, సర్వే నంబర్‌ 14, సర్వే నంబర్‌ 16 ఉన్నట్టుగా నిర్ధారించింది.

ఆ సర్వే నంబర్లలోనే బఫర్‌ జోన్లు ఉన్నాయి. సున్నం చెరువు ఎన్డీఎల్‌, బఫర్‌ జోన్‌లను నిర్ధారిస్తూ 2014 మే 14న నోటిఫికేషన్‌ జారీ చేశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్ధారించిన ఎన్టీఎల్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

కొందరు కబ్జారాయుళ్లు దాన్ని ముందుకు జరపగా.. ఇంకొందరు ఫెన్సింగే లేకుండా చేశారు.

సర్వే నంబర్‌ 13, 14ల్లో చెరువు భూమి లేకుండా చేయగా, ప్రస్తుతం సర్వే నంబర్‌ 16పై కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఎన్టీఎల్‌, బఫర్‌జోన్‌ లేకుండా చేయడానికి గత బీఆర్ఎస్‌ నేతల సూచనల మేరకు ఇలా రోడ్డు నిర్మించారన్న ఆరోపణలూ ఉన్నాయి.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండలం అల్లాపూర్‌ రెవెన్యూ పరిధిలోకి వచ్చే ఈ చెరువు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుంట్లబేగంపేట రెవెన్యూ పరిధిలోనూ కొంత ఉంటుంది.

రెండు జిల్లాల యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కబ్జాకు గురైంది. అంతేకాదు, ఒకవైపు అక్రమ నిర్మాణాలు, మరోవైపు చెరువు పరిసర ప్రాంతాలను మట్టితో కప్పి బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.

గతంలో రెవిన్యూ అధికారులు అడపాదడప నీటి వ్యాపారంపై చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఒక్క సున్నం చెరువులోనే 700 ట్యాంకర్లతో వ్యాపారం జరుగుతుందని గతంలో అనేక ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. దుండిగల్‌లోని కొత్వా చెరువులో ఆక్రమంగా నిర్మిస్తున్న 11 డూప్లేక్స్‌ విల్లాలను అధికారులు తొలగించి రెండు ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

అమీన్‌పూర్‌లో ఆక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా…

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇది వరకే పలు నిర్మాణాలు కూల్చేసిన అధికారులు.. తాజాగా మరిన్ని నిర్మాణాలను ఆదివారం నేలమట్టం చేశారు.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అమీన్‌పూర్‌ పెద్దచెరువు సర్వే నంబర్‌ 322, 323, 324, 329లో ఆక్రమించిన ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో ఏకకాలంలో నేలమట్టం చేశారు.

అంతేకాదు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందిన 20 ఎకరాల భూములపై నజర్‌ పెట్టి కూల్చివేతలు చేశారు. కాంపౌండ్‌వాల్‌తో సహా గదులను సైతం నేలమట్టం చేశారు. తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగిన మూడు శాఖల అధికారులు పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశారు.

హైడ్రా కమిషనర్‌ గత వారం రోజుల కింద పర్యటించిన నేపథ్యంలో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.