రేషన్‌ కార్డుల నిబంధనలు సవరించాలి…!!

రేషన్‌ కార్డుల నిబంధనలు సవరించాలి…!!

క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అసదుద్దీన్‌ ఒవైసీ వినతి

హైదరాబాద్‌ :

రాష్ట్రంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5.67 లక్షల నిరుపేద కుటుంబాలు అంత్యోదయ అన్నయోజన కార్డులను వినియోగించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రేషన్‌ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి ఆదివారం వినతి పత్రం సమర్పించారు.

దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని హస్త కళాకారులకు అంత్యోదయ కార్డులను అందజేయాలని కోరారు. రేషన్‌కార్డుల జారీకి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయ పరిమితిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. భూపరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను సవరించి కార్డులు జారీ చేయాలని కోరారు.