సిరిసిల్ల టు సిద్దిపేట ఫోర్‌లేన్…!!!
మూలమలుపులు లేకుండా కొత్తగా రోడ్డు నిర్మాణానికి డీపీఆర్
మానేరువాగుపై మరో వంతెన
నేషనల్ హైవే 365 బీకి కొత్త రూపు
రూ.1,100 కోట్లతో పనులు
150 అడుగులతో భూసేకరణ
ఆందోళనలో భూయజమానులు
సిరిసిల్ల :
ధార్మికక్షేత్రం వేములవాడ.. కార్మికక్షేత్రం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కొత్త రహదారి రూపుదిద్దుకోనుంది. సిరిసిల్ల-సిద్దిపేట మధ్య 36 కిలోమీటర్ల డబుల్ రోడ్డుపై 25 ప్రదేశాల్లో ప్ర మాదకరమైన మలుపులున్నాయి. ఈ రోడ్డు కాకుండా కొత్తగా 150 అడుగుల(ఫీట్ల) వెడల్పుతో మరో జాతీయ రహదారి(ఎన్‌హెచ్) నిర్మాణానికి రూ.1,100కోట్లతో కేంద్రం అనుమతించగా.. అలైన్మెంట్ ఖరారైంది. సిద్దిపేట జిల్లా దుద్దెడ నుంచి రాజీవ్‌రహదారి కాకుండా కొత్తగా మరో రహదారిని 54 కిలోమీటర్ల మేర సిరిసిల్ల వరకు నిర్మించనున్నా రు. దీని కోసం డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) జాతీయ రహదారుల విభాగం సిద్ధం చేసింది.
దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు
సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కిలోమీటర్ల 365బీ రోడ్డును కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇరుకుగా ఉన్న ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు కొత్తగా నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేయాలని నిర్ణయించింది. ఎన్‌హెచ్ 365బీలో భాగంగా 54 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా కొత్త రోడ్డు నిర్మించనున్నారు. దుద్దెడ నుంచి మ ర్పడగ, సిద్దిపేట అర్బన్ మండలం పరిధిలోని తడ్కపల్ల్లి, ఎన్సాన్పల్లి, బూర్గుపల్లి, గుండావాలీఖర్దు, సిద్దిపేటరూరల్ మండల పరిధిలోని పుల్లూరు, చిన్నకోడూరు మండల పరిధిలోని రామంచ, గంగా పూర్, నారాయణరావుపేట మండలం పరిధిలోని మల్యాల, గుర్రాలగొంది, జక్కాపూర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, బద్దెనపల్లి, మండెపల్లి, తంగళ్లపల్లి, సిరిసిల్లఅర్బన్ పరిధిలోని రగుడు కలెక్టరేట్ క్రాస్‌రోడ్డు వరకు కొత్తరోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. సిరిసిల్లమానేరు వాగుపై మరో కొత్త వంతెన నిర్మించనున్నారు.
సంయుక్త సర్వేలకు ఆదేశాలు
జాతీయ రహదారుల విభాగం భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సంయుక్త సర్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే ‘సెస్’ సంస్థ అధికారులు ప్రతిపాదిత రోడ్డులో ఉన్న విద్యుత్ లైన్ల షిఫ్టింగ్‌కు అయ్యే ఖర్చు అంచనాలను క్షేత్రస్థాయి సర్వే చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ అందించే ధృవ కన్సల్టెన్సీ ఏజెన్సీతో కలిసి సంయుక్త సర్వేలు చేయాలని ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్‌ను నేషనల్ హైవే విభాగం ఈఈ ఆదేశించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో సర్వేలు సాగుతున్నాయి.
జిల్లాలో కొత్త రోడ్డు వణుకు
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు జిల్లా ప్రజలు సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌కు వేగంగా వెళ్లేలా ఈ ఫోర్‌లేన్ జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. మలుపులు లేని రహదారి 54 కిలోమీటర్ల రోడ్డు 150 అడుగుల వెడల్పుతో సమీప భవిష్యత్‌లో జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే కొత్త రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణతో జిల్లాలో వణుకు మొదలైంది. ఇప్పటికే రైల్వేలైన్, జలాశయాలు, కొత్త రోడ్ల నిర్మాణాలకు భూములు కోల్పోయిన జిల్లా వాసులు మరోసారి జాతీయ రహదారి నిర్మాణానికి భారీ ఎత్తున భూములను ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లెల్ల నుంచి జిల్లా కేంద్రం వరకు విలువైన వ్యవసాయ భూములు, బైపాస్‌రోడ్డు వెంబడి విలువైన స్థలాలు, భవనాలు రోడ్డు నిర్మాణంలో కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా ఎవరి భూములు, ఎవరి స్థలాలు, ఎవరి భవనాలు జాతీయ రహదారి నిర్మాణంలో పోతాయనే వణుకు మొదలైంది. భూసేకరణలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కె ట్ విలువతో పోల్చితే చాలా తక్కువగా ఉండడంతో భూనిర్వాసితులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల మధ్యలోనుంచి రోడ్డుపోతే.. అటూ.. ఇటూ రాకపోకలకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. గూగుల్ ఎర్త్ సహకారంతో ఇప్పటికే రహదారి నిర్మాణానికి చేసిన ప్రతిపాదనల మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాప్ భూయజమానుల్లో భయాన్ని నింపుతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలియదు కానీ.. జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ అంశం భూకంపం సృష్టిస్తుంది.
150 ఫీట్లతో భూసేకరణ
దుద్దెడ-సిరిసిల్ల రోడ్డు నిర్మాణానికి 150 ఫీట్లతో భూసేకరణ జరుగుతుంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఇప్పటికే వంద ఫీట్ల రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఇరువైపులా 25 ఫీట్లతో విస్తరిస్తారు. కొత్తగా రోడ్డు నిర్మించేందుకు నేరుగా 150 ఫీట్లతో సేకరిస్తారు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలతో కన్సల్టెన్సీ ఏజెన్సీ పూర్తి డీపీఆర్‌ను రూపొందిస్తుంది.
అన్నయ్య, డీఈఈ, నేషనల్ హైవే, సిద్దిపేట